బెంగ

చుట్టూ చీకటి
కదలటానికి కుదరటం లేదు
మాటలు వినపడుతున్నాయి
అర్ధం కావు
అమ్మ ప్రేమ తెలుస్తుంది
కాని కనపడదు
అమ్మని చూడాలని బెంగ

స్కూలుకు వెళ్ళనేమోనని
అమ్మకి బెంగ
స్కూలుకి వెళితే
అమ్మ కనపడదని
పిల్లలకు బెంగ
పిల్లలు రాకపోతే
జీతం రాదని
పంతులు కి బెంగ

ఎండలు మండిపోతున్నాయి
నీళ్లు ఆవిరి అవుతున్నాయి
అయిపోతున్న నీళ్ళని చూసి
నదికి బెంగ
చల్ల గాలికి మబ్బు
బరువుగా కదిలింది
చక్కని చిరుగాలికి
జల జలా కురిసింది
జారిపోతున్న బిందువులను చూసి
మబ్బుకి బెంగ

దూర దేశం వెళుతున్న
భర్తను చూసి
భార్యకు బెంగ
నాన్న ఎప్పుడు వస్తాడో అని
పిల్లలకు బెంగ
తిరిగి వస్తానో రానో అని
భర్తకు బెంగ

మనిషి పై మనిషి కి ప్రేమ
కొలతలకు అందని ప్రేమ
దూరాలకు తీరని ప్రేమ
చక్రవడ్డీలా పెరిగిపోతున్న ప్రేమ
ఎలా తీర్చాలో తెలియని ప్రేమ

కాలం కలసిరావాలని
మనుషులు కలుసుకోవాలని
ప్రేమను పంచుకోవాలని
కలలు కంటున్నారు
కన్నీరు తుడుచుకుంటూ
నిద్రలోకి జారిపోతున్నారు

కాలంతో పాటు కరిగిపోతున్నారు
ఆరడుగుల గోతిలోకి
జారిపోతున్నారు
చుట్టూ చీకటి
కదలటానికి కుదరటం లేదు
అందరిని చూడాలని
అమ్మా నాన్నను కలవాలని
అనంతలోకాలకు సాగిపోతున్నారు.

-0-
Bhavani P Polimetla
July-2017
Austin, Texas, USA

Advertisements
%d bloggers like this: