పేరు లేని ఊరు

sattemma_talli

1980
సత్తెమ్మ తల్లి గుడికాడ
మిట్ట మద్యాన్నం ఎర్రటెండలో
కిర్రు కిర్రు సప్పుడు సేసుకుంటూ
ఎర్ర బస్సు ఆగింది
ముందు సీట్లో దొరగారు
తెల్ల లాల్చి నలగకుండా
ముందే దిగిపోయిండ్రు
బస్సు పైనున్నోల్లు
పుంజు, పెట్ట,
మోపు, మోకు ఏసుకొని
నిచ్చెన మీదనుండి
కిందకు దూకిండ్రు
పైన ఎండ మండి పోతున్నా
బాయిలోని నీళ్ళు సల్లంగా ఉంటాయంట
సత్తెమ్మ తల్లి మహిమని సెప్పిండ్రు
దొరగారు బాయి దగ్గర నుంచొని
దర్జాగా నీళ్ళు తాగిండ్రు
బస్సుమీద వున్నాళ్ళు
అంత దూరంలో నిలుసుండ్రు
బొక్కెనతో నీళ్ళు ఎత్తి పోస్తుంటే
వంగోని వంగోని దోసిలి పట్టి
కడుపు నిండా తాగిండ్రు
పల్లె లోకి పోవాలంటే
మూడు మైళ్ళు నడవాలే
జోడెద్దుల గూడు బండి
ఠీవి గా వచ్చింది
బండి తోలే టోడు
పెట్టె లోపల పెట్టిండు
ఎత్తు పీఠ వేసిండు
దొర పీఠ మీద కాలేసి
సుట్టూ ఒకపారి జూసి
బండి ఎక్కిండు
అవ్వ, నేను
చేతి సంచి భుజానికెత్తుకుని
పల్లెలోకి నడుసుకుంటూ బోతున్నాం
దారిలో సిన్న వూరు
దాటుకుంటూ  బోవాలె
అవ్వా, ఈ వూరు పెరెందన్న
పెరులేదురా బిడ్డా అంది
అదేందే అవ్వా అట్లంటావ్ అన్నా
సదువుకున్నాళ్ళే లేని వూళ్ళో
ఊరుకి పేరు ఎవరు పెడతారు బిడ్డా అంది
పల్లెలో ఆవులు, గేదెలు సత్తే
ఈల్లోచ్చి తీసుకెల్తారంట
దొరగారికి, దొరసానికి
కాలి జోల్లు కుడతారంట
దొర సెప్పే ఇషయాలను
దండోరా ఏస్తారంట
దొర సెప్పే సిన్నా సితకా
పనులు చేస్తారంట
ఆల్లలో ఆల్లే
పెళ్ళిళ్ళు సెసుకున్తారంట
మంత్రాలు సదివేకి
పల్లే లోని పంతులు రాడంట
పేరు లేని వూళ్ళో బడి లేదు
ఊళ్ళోని పిల్లలకు సదువు లేదు
పొలం గట్లంట ఆడతా వుండారు
పాల పిట్టల వెంట పరిగెడుతున్నారు
తంగేడు పూలు తెంపి పోస్తున్నారు
అయ్యా పనిజేసినప్పుడు
అన్నం తింటా వుండారు
పనిలేనప్పుడు
గంజి నీళ్ళు తాగుతున్నారు
పుష్టిగా లేకున్నా
ఎగిరెగిరి పడుతున్నారు

paala_pitta

tangedu_puvvu

అవ్వ చెప్పే విషయాలు
కంటికి కనపడుతూ వున్నాయి
మెల్ల మెల్లగా నడుసుకుంటూ
పల్లె సివర్లో వున్న
అవ్వ ఇంటికి సేరుకున్నాము
చిన్న పల్లె
పేరు లేని ఊరుకి దూరంగా
సుట్టూ పొలాలు
మద్యలో గుడి
పెద్ద దొరగారిది పెద్ద మెడ
సిన్న దొరలవి పెంకుటిళ్ళు
పల్లె శివారులో మిగతా వాల్లు
ఆడుకునేందుకు
అందరి ఇండ్లకు బోయినా
కుమ్మరి సెక్రం తిప్పిన
మేదరి బుట్టలు అల్లిన
కమ్మరి తిత్తులు నొక్కిన
గొల్లల ఆవులు మేపిన
చాకలి రేవుల ఆడిన
దర్జీ మిషను సూసిన
జాలరి జతలో
గౌడల జతలో ఆడిన
 —
పొలం కొనాలన్నా
పొలం అమ్మాలన్నా
భూమి కొలవాలన్నా
పెద్ద దొరకి సెప్పాలే
కాయితం రాయాలన్న
అప్పు పుట్టాలన్న
రేడియో ఇనాలన్నా
దొర ఇంటికి పోవాల్సిందే
పల్లెలో అందరూ సాయం చేస్తారు
సంక్రాంతికి ఒక్కసారి
అందరికి వొడ్లు కొలవాల్సిందే
పక్క వూళ్ళో పాఠశాలకి పోవాలంటే
ఐదు కిలోమీటర్లు
వైద్యుడిని సూడాలంటే
బండిమీద ఇరవై కిలోమీటర్లు పోవాల్సిందే
కన్నుమూసి తెరిసేలోపు
కాలం తిరిగి పోయింది
వైద్యం అందక తాత
వైసు అయిపోయి అవ్వ
దేవుడి దగ్గరకి వెళ్లి పోయారు
తెలంగాణా వస్తే
కష్టం కాటికి పోద్దని
పేరు లేని ఊరోళ్ళు
పల్లె లోని పేదోల్లు
పాకులాడి పోరాడి
తెలంగాణా తెచ్చుకుండ్రు
2014
పేరులేని వూరు
పక్కనున్న పల్లెటూరు
అలాగే వున్నాయి
సదువుకున్నోలందరూ
పట్టణం వచిండ్రు
కార్పోరేట్ కంపెనీల్లో
పనికి కుదిరిండ్రు
అమెరికా నుంచి
తెల్ల దొరగారు వస్తున్నారంటూ
తాకీదు పంపిండ్రు
పల్లెటూరు నుంచి
పట్నం వచ్చిన దొరబిడ్డలు
బట్టలు సాపు జేసిండ్రు
తలంటి క్రాపు నున్నగా దువ్విండ్రు
వచ్చిన దొరగారికి
వంగి వంగి సలాంలు జేసిండ్రు
అందితే జుట్టు పట్టుకుంట్రుండు
అందకపోతే కాళ్ళు వొత్తుతుండ్రు
ఆత్మాభిమానాన్ని చంపుకొని
అడ్డంగా బతికేస్తుండ్రు
రాష్ట్రాలు వచ్చినా
జెండాలు మారినా
మనిషి మారనంతవరకూ
వాడు సుఖ పడడు
పక్కవాడిని సుఖంగా వుండనీయాడు
పేరు లేని వూరు
ఇప్పటకీ ఎదురుచూస్తూవుంది
మారిన మనిషి కోసం
ఉదయించే సూర్యుడి కోసం
-o-
Bhavani Polimetla
On Telangaanaa Formation Day
Jun-02-2015
Hyderabad, India

 

Advertisements
  1. durgam rajesh
    June 3, 2015 at 3:27 am

    well said.

  2. June 4, 2015 at 2:14 am

    baavundi andi

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: