ఉగాది ఊయల


తల్లి కడుపులో
తండ్రి వొడిలో
కాల చక్రంలో
జీవన నౌకలో
పాడెపై కాటికి వెళ్తూ
మనిషి ఊయల ఊగుతున్నాడు

కుళ్ళు మనుషుల మధ్య
మూఢనమ్మకాల మధ్య
ఏంకావాలో తెలియని వెధవల మధ్య
అన్నీ తెలుసనుకొనే శుంఠల మధ్య
అహంకారం, అవమానాల మధ్య
మూర్ఖుల మధ్య , మూడుల మధ్య
మంచితనం లేని పశువుల మధ్య
కళ్ళు మూసుకున్న కామంధుల మధ్య
వితండ వాదుల మధ్య
వింత మనుషుల మధ్య
మానవత్వం సచ్చిన మనుషుల మధ్య
పగలు రాత్రి కి మధ్య
పుట్టుక చావుల మధ్య
మనిషి ఊయల ఊగుతున్నాడు

అలసిన శరీరంతో
నలిగిన మనస్సుతో
కన్నీరు ఇంకిన కళ్ళతో
ఆలోచనా ప్రవాహాలను
ఆపలేని నిస్సాహాయతతో
తూలుతూ తూగుతున్నాడు
జీవితం అనే
ఊయలపై ఊగుతున్నాడు

గడచిన క్షణాలను తలచుకుంటూ
జీవం లేని జీవితాన్ని నెట్టుకుంటూ
వొడ్డు చేరుతున్న అలల వలె
గమ్యం లేని
దూరం తెలియని
జీవితం అనే ఊయలలో ఊగుతున్నాడు
కనిపించని దూరాలకు సాగుతున్నాడు

జీవితం అనే రహదారిపై
ప్రాణాన్ని ఇరుసుగా
మనసు అనే చక్రంతో
సాగి పోతున్నాడు
గాయ పడిన మనస్సుతో
ముందుకు కదలలేక
వెనుకకు మరలలేక
ఆలోచనల ఊయలపై
భూమి ఆకాశం మధ్య
ఊయల ఊగుతున్నాడు

కాలం మారుతోంది
ఉగాది మళ్ళీ వస్తోంది
మావి మళ్ళీ చిగురిస్తోంది
కోయిల మళ్ళీ కూస్తోంది
కాని మార్పు లేని మనిషిలో
మార్పు కోసం ఎదురు చూస్తూ
మనిషి మారతాడేమోనని
ప్రేమతో ప్రార్ధిస్తూ
మనస్పూర్తిగా క్షమిస్తూ
మానని గాయాలను మరచిపోతూ
ప్రకృతితో మమేకం అవుతూ
కాల చక్రంలో తిరుగుతూ
మరో ఉగాదికై ఎదురు చూస్తూ
ఊహలలో విహరిస్తూ
జీవితం అనే ఊయలపై
మనిషి సాగిపోతున్నాడు

పిచ్చి భ్రమలలో బ్రతికేస్తున్న
పిచ్చి మనిషి వీడు.

Bhavani P Polimetla
09/April/2016
Hyderabad, India

Advertisements
%d bloggers like this: